“ఓజోన్ పరిరక్షణ దినం”
అతినీలలోహిత కిరణాల నుంచి భూమిపై నివసించే సకల జీవకోటికి రక్షణ కవచంగా నిలుస్తోంది ఓజోన్ పొర. ప్రాణకోటికి ప్రకృతి అందించిన వరం ఇది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఓజోన్ పొర క్షీణిస్తోందని కనుగొన్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో జీవకోటికి తలెత్తే ముప్పును గమనించిన ఐక్యరాజ్యసమితి, ఓజోన్ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలను ఏకం చేసింది. *సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినంగా ప్రకటించింది.*
సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమి మీద పడటం వల్ల సకల జీవరాసులకూ ముప్పు వాటిల్లుతోంది. ఆ వేడిని తట్టుకునే సామర్థ్యం భూమిపై నివసించే జీవరాసులకు లేదనే చెప్పాలి. మనుషులు సైతం తట్టుకోలేని పరిస్థితి తలెత్తుతుంది. ప్రకృతి గతితప్పుతుంది. భూమిపైన 15 నుంచి 25కిలోమీటర్ల వరకూ ఉండే రెండో పొరను *ఓజోన్‌పొర(ఓ3)* అంటారు. ఈ పొర సూర్యుని నుంచి వెలువడే కిరణాలు నేరుగా భూమిమీదకు చేరకుండా అందులో ఉండే అతినీలలోహిత కిరణాలను సంగ్రహిస్తుంది. తద్వారా ప్రాణకోటికి వాటిల్లే ముప్పు నుంచి కాపాడుతోంది ఓజోన్ పొర.
మనిషి స్వార్థానికి ప్రకృతి ప్రమాదంలో పడుతూనే ఉంది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కడంతో ప్రమాద స్థాయి పెచ్చురిల్లుతోంది. పల్లెల నుంచి చాలా మంది పట్టణాలకు వలసబాట పట్టడంతో కాలుష్యం పెరిగిపోతోంది. ఇబ్బడిముబ్బడిగా మోటారు వాహనాలు పెరగడం, పరిశ్రమల కాలుష్యం, అధిక శాతం మంది ఏసీలను వినియోగించడం ఓజోన్ పొరకు చేటు తెస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా, అవేవీ పట్టనట్టు వ్యవహరించడంతో వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. మానవ తప్పిదాల వల్ల పుడమికి రక్షణ కవచంలా ఉండే ఓజోన్ పొర నేడు పలుచబడిపోతోంది. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొర దెబ్బతింటూ ఉండటంతో *మానవులు రోగాల* బారిన పడుతున్నారు.
సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి భూమిని కాపాడే ఓజోన్ పొరకు ముప్పు వాటిల్లుతోంది. రసాయన కాలుష్యాలతో ఓజోన్ పొరకు చిల్లులు పడుతున్నాయి. రసాయన కాలుష్యం పెచ్చురిల్లితే మానవ సమాజానికే ప్రమాదమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
పొంచి ఉన్న ముప్పు
కొంచెం ఎండ ఎక్కువైతే బయటకు వెళ్లడానికి భయపడతాం. ఇక భగభగమండే సూర్య కిరణాలు నేరుగా మనపై పడితే తట్టుకోలేం. కానీ, ఆ విధమైన ప్రమాదం సమీప భవిష్యత్తులో పొంచి ఉందనే ఆందోళన ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎందుకంటే సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల ప్రభావం నేరుగా మనమీద పడకుండా మనల్ని రక్షించే ఓజోన్ పొర క్రమేపీ పలుచబడుతోంది. దీనికి మానవ విధ్వంసమే ప్రథమ కారణమని శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. ఓజోన్ పొర క్షీణించిపోతోందని *1987లోనే మాంట్రియల్ ప్రొటోకాల్*(ఓజోన్ పొర క్షీణతపై జరిపిన పరిశోధన) హెచ్చరించింది. ఓజోన్ పొరకు వాటిల్లుతున్న ముప్పును అరికట్టాలని శాస్త్రవేత్తలు సూచించారు. ఈ నేపథ్యంలో 1994 సెప్టెంబర్ 16న మరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓజోన్ పొర క్షీణతను అరికట్టేందుకు నిర్ణయించారు. దీంతో ఏటా సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం జరపాలని నిర్ణయించారు.
ఏటా 20 లక్షల మందికి చర్మ కేన్సర్…
సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు భూమి మీద పడకుండా నిలువరించే ఓజోన్ పొరను 1930లో కనుగొన్నారు. భూ ఉపరితలంపై *స్ర్టాటోస్పియర్* ఆవరణంలో ఓజోన్ ఉంటుంది. 25 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తులో ఎక్కువగా ఆవరించి ఉంటుంది. స్ర్టాటోస్పియర్ ఆవరణలో 0.6 పీపీఎం ఓజోన్ ఉంది. స్ర్టాటోస్పియర్‌లో ఉన్న ఓజోన్ అతినీలలోహిత కిరణాలను సంగ్రహించుకుంటుంది. క్లోరోఫాం కార్బన్ ఉపయోగించడం వల్ల స్ర్టాటోస్పియర్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీంతో ఓజోన్ పొరకు ముప్పు వాటిల్లుతోంది. ఓజోన్ పొరకు చిల్లులు పడడం వల్ల అతినీలలోహిత కిరణాలు భూమిని తాకడంతో నేత్ర వ్యాధులు, చర్మ కేన్సర్, చివరగా జన్యుపరమైన వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుతం స్ర్టాటోస్పియర్‌లో ఉష్ణోగ్రతలు పెరగడంతో నేత్ర వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నేత్ర వ్యాధులు ప్రబలడం తొలి దశలోనే ఉన్నాం. శీతల దేశాలైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఈ ప్రభావం కనిపిస్తోంది. ఒక సర్వే ప్రకారం భూమిమీద 20 నుంచి 30 లక్షల మంది వరకూ చర్మ కేన్సర్ బారినపడినట్టు తెలిసింది.
శాస్త్రవేత్తల నిర్ధారణ
మానవాళి అవసరాలకు వాడే అనేక వస్తువుల నుంచి వెలువడే కాలుష్యం, వాటి ఉత్పత్తికి వాడే రసాయనాలతో ఓజోన్ పొరకు ముప్పు ఏర్పడుతోందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. హేలోన్స్, మిథైల్ క్లోరోఫాం, మిథైల్ బ్రోమైడ్, సీఎఫ్‌సీ వంటివి ఓజోన్ పొరకు ప్రమాదం తీసుకువస్తున్నాయి. ఏరోసోల్ ఉత్పత్తులు, రిఫ్రజరేషన్, ఎయిర్ కండిషినింగ్ ఉత్పత్తులు, ఫోం బ్లోయింగ్ ఆప్లికేషన్స్, స్ర్పేల ఉత్పత్తులను విచ్చలవిడిగా వినియోగించడంతో ఓజోన్‌కు ముప్పువాటిల్లుతుందని గుర్తించారు. భారతదేశం 1993 నుంచి జాగ్రత్తలు తీసుకునే పనిలో పడింది. సీఎఫ్‌సీ వంటి ఉత్పత్తులు నిలిపివేయాలని 296 కన్వర్షన్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. 2008లోనే క్లోరోఫ్లోరో కార్బన్ల వినియోగాన్ని నిలిపివేసింది. మాంట్రియల్ ఒప్పందం మేరకు గడువు కంటే ముందుగానే అనేక నియంత్రణలు పాటించింది మన దేశమే. సీటీసీ ఉత్పత్తులు వినియోగాన్ని 85 శాతం మేరకు కుదించడానికి సంబంధించే లక్ష్యం నెరవేర్చిన దేశం కూడా మనదే. భారతదేశంలో సీఎఫ్‌సీకి ప్రత్యామ్నాయంగా అనేక పరిశోధనలను హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ *(ఐఐసీటీ)* చేపడుతోంది. మిగతా వర్సిటీలు, పరిశోధనా సంస్థలు సీఎఫ్‌సీకి ప్రత్నామ్నాంగా పరిశోధనలు చేస్తున్నాయి. ఇదే సమయంలో మనిషి విలాసాలను తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది.
2020 నాటికి దేశంలో ‘హెలో హైడ్రోకార్భన్ల’ వాడకాన్ని నిషేధించాలని భారత ప్రభుత్వం 2011 మాట్రియల్ ప్రొటోకాల్, 2013లో క్యోటో ప్రొటోకాల్‌పై భారత్ సంతకం చేసింది. ఫ్రిజ్‌లు, ఏసీలలో శీతలీకరణ కోసం ఉపయోగించే కండెన్సర్‌లో *హెలో హైడ్రోకార్భన్లు* వినియోగిస్తారు. ఇంకా అనేక వస్తువులల్లో దీనిని వినియోగిస్తున్నారు. అయితే హెలో హైడ్రోకార్భన్ల వినియోగం వల్ల ఓజోన్ పొరపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనలో వెల్లడైంది.. శీతలీకరణకు ఉపయోగంతోపాటు భారీగా అగ్నిప్రమాదాలు జరిగితే క్షణాల్లో మంటలు అదుపులోకి తీసుకురావడానికి కూడా దోహదపడేలా అణువులను కనుగొనే ప్రయత్నం చేయనున్నారు.
జీవన విధానం మార్చుకోవాలి
అందివచ్చిన విలాసాలను విచ్చలవిడిగా వాడుతున్నాం.
ముఖ్యంగా పట్టణాల్లో ఇటువంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ఏసీలు, కాస్మోటిక్స్, స్ర్పేల నుంచి ప్లాస్టిక్ వరకు ప్రతి వస్తువును పరిమితికి మించి వినియోగిస్తున్నాం. ఇదే ఓజోన్ పొరకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి తీసుకు వస్తోంది. సీఎఫ్‌సీ తగ్గాలంటే తొలుత ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. అవసరం మేరకు స్ర్పేలు వాడాలి. ఏసీల వాడకం తగ్గించాలి. పాలిథిన్ వినియోగం తగ్గించాలి. బజారుకు వెళ్లే వారంతా *గుడ్డ సంచులు తీసుకుని వెళ్లాలి.* మానవ జీవన విధానం మార్చుకోవాలి. ఓజోన్ పొరకుహాని కలిగించే వస్తువుల వాడకంపై ప్రజల్లో చైతన్యం రావాలి.