#telangana_luminaries
ప్రఖ్యాత రచయిత్రి మాదిరెడ్డి సులోచన `
(26.10.1935 – 16.2.1983)
జన్మస్థలం: హైదరాబాదు సమీపంలోని శంషాబాద్.
మాదిరెడ్డి సులోచన శంషాబాద్ గ్రామంలో మాణిక్యమ్మ, రామకృష్ణారెడ్డి దంపతులకు 1935 అక్టోబర్ 26 న జన్మించారు. వీరిది సాంప్రదాయక వ్యవసాయక కుటుంబం. వీరు బి.ఎస్.సి., బి.ఇడి., ఎం.ఏ.ఎం.ఇడి . పూర్తి చేసి, 1971 వరకు సుమారు 10 సంవత్సరాలు ఉపాధ్యాయినిగా పని చేశారు. వీరు ఇథియోఫియా, బాంబియా దేశాలకు వెళ్ళి అక్కడ కూడా కొంత కాలం ఉపాధ్యాయినిగా పని చేశారు .
1965 లో ‘ జీవనయాత్ర ‘ పేరుతో ప్రారంభమైన వీరి నవలా ప్రస్థానం తరంగాలు , కలహంస , అందగాడు, అపురూప , నాగమల్లికలు, సంధ్య, శిక్ష, పూలమనసులు, మిష్టర్ సంపత్ ఎంఎ, లాహిరి, సజీవ స్మృతులు, స్నేహప్రియ, రాలిన రేకులు, నవతరం, ఎంత ఘాటు ప్రేమయో, పంతులమ్మ, వారసులు, కలకాదు సుమా,వంశాంకురం, అందని పిలుపు, నెలవంక, బిందు పథం, సుప్రియ, గడ్డితినే మనుషులు,మరో ప్రేమకథ, గాజు బొమ్మలు, ప్రేమ పంజరం, అపరంజి, సంసారనౌక, పుణ్యపురుషులు, ఋతుచక్రం, చిగురాకులలో చిలకమ్మ, మీరైతే ఏం చేస్తారు, ఆశయాల ఆఖరిమెట్టు, అధికారులు – ఆశ్రిత జనులు, సంధ్యారాగం, గెలుపు నాదే, అభినేత్రి, ఇల్లు కట్టి చూడుపెళ్ళి చేసి చూడు, శ్రీనిలయం, సృష్టిలో తియ్యనిది లాంటి 72 నవలలతో పాటూ దాదాపు 150 కథలు, 21 నాటికలు, 10 ఏకాంకికలు రాశారు. వీరి రచనలు ఆనాటి దిన, వార,మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి .
ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసి తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు. ప్రేమలూ, పెళ్ళిళ్ళకంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కథా రచయిత్రి అవార్డులు పొందారు.
వీరు రచించిన 10 నవలలు మేనకోడలు, ప్రేమలు – పెళ్ళిళ్ళు , ఈ కాలం పిల్లలు , ఈ తరం మనిషి , కళ్యాణి , కలవారి సంసారం, చందమామ, తరం మారింది మొదలగునవి సినిమాలుగా నిర్మించబడ్డాయి. 1977 లో ‘ తరం మారింది ‘ సినిమాకు ‘ నందిఅవార్డు ‘ లభించింది . వీరి రచనలపై అనేక పరిశోధనలు జరిగాయి. 1965 నుండి రచనలు ప్రారంభించిన మాదిరెడ్డి సులోచన 1983 ఫిబ్రవరి 16న అకాల మరణం చెందే వరకు రచనను కొనసాగించారు .
౼ సేకరణ:- తారీఖుల్లో తెలంగాణ
౼ప్రచురణ:- భాషా సాంస్కృతిక శాఖ.
మాదిరెడ్డి సులోచన కథలన్ని పరిసరాల నుంచి ప్రభావితమై రచింపబడినవే, మారుతున్న కాలాన్ని, మనుషుల ప్రవర్తనలను, ఆలోచనలను మంచివైపు నడిపించే ఆరాటం కనిపిస్తుంది. ‘యెవరూ ఏ తప్పు కావాలని చేయరు, అయినా శిక్షింపబడుతారు’. ఇలా ఇద్దరు వ్యక్తుల మద్య జరిగే సన్నివేశలు ఎలాంటి పరిస్థితులకు దారి తీసినదో తెలియాలంటే, మాదిరెడ్డి సులోచన గారు రాసిన “తనదాకవస్తే!” అనే కథను చదవండి. అలాగే బలరామ్ కి రాజేశ్వరి పై పెట్టుకున్న నమ్మకాన్ని డబ్బు ఏ విధముగా మార్చేసిందో “డబ్బు! డబ్బు! డబ్బు!” అనే కథను మాదిరెడ్డి సులోచన గారు చాలా చక్కగా రాశారు. ఇలాంటి మరెన్నో వాస్తవికతకు దగ్గరగా ఉంటే కథలు తెలియాలంటే తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురించిన “మాదిరెడ్డి సులోచన కథలు” అనే పుస్తకం చదవండి. (వెల:-120/-)
తెలంగాణ పల్లె జనజీవన సంస్కృతినీ, క్రమ పరిణామాలను తొణికిసలాడే విధంగా రూపొందించిన విశిష్టమైన నవల “తరం మారింది”. ఆచరణాత్మకమయిన ఆదర్శాలను యువతరం ఆలోచించేటట్లు చేసిన రచన. తరాలు మారడంతో పాటు సమాజం మారాలనే ఒక సందేశాన్నందించింది. తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురించిన “తరం మారింది” అనే పుస్తకం చదవండి. (వెల:-60/-)