#telangana_luminaries
షోయబుల్లాఖాన్
(12.10.1920- 22.08.1948)
జన్మ స్థలం:- వరంగల్లు జిల్లా మానుకోట గ్రామం.
పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు #షోయబుల్లాఖాన్, పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర విముక్తి ఉద్యమ, స్వాతంత్ర్య సమర చరిత్రలో ప్రముఖుడు. ఆయన అసమాన త్యాగం ఉత్తేజపరిచే ఒక ఉజ్వల అధ్యాయం. ఆ అమరవీరుని గాధ ఆదర్శప్రాయం, చిరస్మరణీయం, హిందూ – ముస్లిం సోదరత్వానికి సజీవ ప్రతీక షోయబుల్లాఖాన్!
షోయబ్ వరంగల్లు జిల్లా మానుకోటలో జన్మించారు. ఆయన తండ్రి హబీబుల్లాఖాన్ నిజాం సర్కారులో ఒక పోలీసు అధికారి. షోయబ్ జననానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. గాంధీ మహాత్ముడు దేశమంతటా పర్యటిస్తూ 1920 అక్టోబర్ 12 తేదీన విజయవాడ నుంచి వార్ద రైలులో వెళ్లుతూ మానుకోట రైలు స్టేషనులో కొద్ది నిమిషాలు ఆగి అక్కడకి చేరిన అసంఖ్యాక ప్రజలకు దర్శనం ఇచ్చారు. ఆ రోజు పోలీసు అధికారి హబీబుల్లాఖాన్ మానుకోట స్టేషనులో శాంతి భద్రతల బాధ్యత, విధి నిర్వర్తించడానికి నియుక్తులయ్యారు .
గాంధీ మహాత్ముడి నిరాడంబరత్వం, ఆయన ముఖంలోని తేజస్సు హబీబుల్లాఖాన్ ను బాగా ఆకర్షించాయి. స్టేషనులో విధి నిర్వహణ తరువాత ఇంటికి వెళ్ళిన హబీబుల్లాఖాన్ కు కొడుకు పుట్టిన శుభవార్త తెలిసింది. తన పసిబిడ్డ ముఖంలో హబీబుల్లాఖాన్ కు గాంధీ మహాత్ముడు కన్పించారు. ఆ బిడ్డకు షోయబుల్లాఖాన్ అని నామకరణం చేసారు. ముద్దుగా అందరు ఆ బిడ్డను “ గాంధీ షోయబ్ ” అని పిలిచేవారు.
షోయబ్ లో చిన్నప్పటి నుంచే చురుకుతనం ఎక్కువ. బాల్యంలోనే షోయబ్ రచనా పాటవం వికసించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆయన పట్టభద్రుడు. అనంతరం పత్రికా రచయితగా ఆయన జీవన రంగంలో ప్రవేశించారు .
షోయబ్ పత్రికా రచన మొదట “ తేజ్ వారపత్రిక ” లో ప్రారంభమయింది. నిజాం నిరంకుశ పాలనలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, అరాచకత్వాలను, తీవ్రంగా విమర్శిస్తూ షోయబ్ రాసిన వ్యాసాలు తేజ్ పత్రికలో ప్రచురితమయినాయి. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ అధిపతి ఖాసిం రజ్వీ దుష్ట విధానాలను, మతతత్వాన్ని, అక్రమ చర్య లను విమర్శించి నందుకు నిజాం ప్రభుత్వం తేజ్ పత్రికను నిషేదించింది .
ఆ రోజుల్లో ప్రముఖ స్వాతంత్రోద్యమ నాయకులు మందుముల నరసింగరావు సంపాదకత్వంలో వెలువడుతున్న “రయ్యత్” ఉర్దూ పత్రికలో షోయబ్ రచయితగా ప్రవేశించారు. రయ్యత్ పత్రికలో గూడ షోయబ్ నిర్భయంగా నిజాం నిరంకుశత్వాన్ని, దమన నీతిని, మతోన్మాదాన్ని ఖండిస్తూ రాసారు . నిజాం ప్రభుత్వం రయ్యత్ ను సైతం నిషేధించింది .
షోయబ్ స్వయంగా , తన సంపాదకత్వంలో “ ఇమ్రోజ్ పత్రిక ”ను ప్రారంభించారు. స్వతంత్ర భారత యూనియన్ లో హైదరాబాద్ సంస్థానం బేషరతుగా విలీనం కావాలని షోయబ్ తన పత్రికలో గట్టిగా వాదించారు. ఖాసిం రజ్వీ బహిరంగం గానే షోయబ్ మీద విమర్శలు కురిపించసాగారు. తన పత్రికలో గాంధీ మహాత్ముడిని ప్రస్తుతిస్తున్న షోయబ్ ముస్లింలకు వ్యతిరేకి అని ఖాసిం రజ్వీ ప్రచారం కొనసాగించారు. షోయబ్ ను బెదిరిస్తూ ఆకాశరామన్న ఉత్తరాలు రాసాగినవి .
1948 లో హైదరాబాద్ సంస్థానం పరిస్థితి అదుపు తప్పి భయంకర స్వరూపం భరించింది. ఆ సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ఇమ్రోజ్ సంపాదకుడు షోయబ్ కు మరో బెదిరింపు లేఖ వచ్చింది. అందులో ఆయనను రజ్వీ అనుయాయులు ఘోరంగా దూషించారు. ఆ రోజు సాయంత్రం హైదరాబాద్ నగరం కాచిగూడలో గల ఇమ్రోజ్ పత్రిక కార్యాలయానికి వెళ్ళి బూర్గుల రామకృష్ణారావు తదితరులు షోయిబ్ తో చాల సేపు ముచ్చటించారు.
ఆరోజే అందిన బెదిరింపు లేఖ ప్రస్తావన వచ్చింది. రజ్వీ అనుచరులు మతోన్మాదులని, దుర్మార్గులని , జాగ్రత్తగా ఉండాలని రామకృష్ణారావు ఆందోళన స్వరంతో షోయబ్ కు సలహా ఇచ్చారు. “నేను గాంధీ మహాత్ముడి అడుగుజాడలలో, అహింసా మార్గంలో నడుస్తూ అన్యాయాలను, అక్రమాలను వ్యతిరేకిస్తున్నాను. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. నా మాతృభూమి భారతదేశం కోసం ప్రాణత్యాగం చేయడానికయినా సిద్ధమే “… అని షోయబ్ నిశ్చలంగా రామకృష్ణారావు తో అన్నారు.
ఆగస్టు 22వ తేదీన షోయబ్ రాత్రి 12 గంటలకు యదా ప్రకారం పత్రిక పని పూర్తి చేసి దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్ళుతున్నారు. ఆ నడిరాత్రి షోయబ్ మీద మొదట తుపాకి కాల్పులు జరిపారు . తరువాత కత్తులతో ఆయన రెండు చేతులను దుండగులు నరికివేసారు. షోయబ్ వెంట ఉన్న సహచరుడు ఇస్మాయిల్ ఖాన్ గూడ దుండగుల దాడిలో గాయపడ్డారు. రక్తపు మడుగులో షోయబ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. “ఇమ్రోజ్ పత్రిక ప్రచురణ ఆగరాదు. ధర్మం జయస్తుంది …” అన్న చివరి సందేశంతో దేశభక్తుడు, యువ సంపాద కుడు షోయబుల్లాఖాన్ అమరుడయ్యారు.
(సేకరణ:- తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన “#తెలంగాణ_తేజోమూర్తులు” గ్రంధం.)