#telangana_luminaries
ప్రసిద్ధ రచయిత, చరిత్రకారుడు #ఆదిరాజు_వీరభద్రరావు ఆదిరాజు వీరభద్రరావు
(16.11.1892 – 28.9.1973)
జన్మ స్థలం:- ఖమ్మం జిల్లా దెందుకూరు గ్రామం.
ఆదిరాజు వీరభద్రరావు గారు సంగ్రహాంధ్ర విజ్ఞానకోశ నిర్మాతగా, శాసన పరిశీలకుని
గా, బాలవాజ్ఞ్మయ కర్తగా, ఉత్తమ అధ్యాపకునిగా, తెలంగాణ వికాస చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
ఆదిరాజు వీరభద్రరావు 1892 నవంబర్ 16న ఖమ్మం జిల్లా దెందుకూరులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకమ్మ, లింగయ్య పంతులు. ఆదిరాజు చిన్నతనంలోనే తండ్రి చనిపోవటం వల్ల,
శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం స్థాపకులైన రావిచెట్టు రంగారావు ఆదిరాజు వారిని చేరదీశారు. దాంతో హైదరాబాదులోని చాదర్ఘాట్ హైస్కూలులో మెట్రిక్ చదివారు. 1901లో కొత్తగా స్థాపించిన శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం నిర్వహణలో భాగస్వామ్యం వహించే అవకాశం వీరభద్రరావు గారికి లభించింది. విఖ్యాత పరిశోధకులు కొమర్రాజు వెంకటలక్ష్మణ రావు హైదరాబాదులో 1905లో విజ్ఞాన చంద్రికా గ్రంథమాలను స్థాపించారు. ఆదిరాజు వారు దానిలో సహాయకునిగా చేరారు. స్థానిక అననుకూల పరిస్థితుల వల్ల కొమర్రాజు వారు విజ్ఞాన చంద్రికా గ్రంథమాలను 1908లో బ్రిటీషాంధ్ర రాజధాని మద్రాసు (నేటిచెన్నై)కి తరలించారు.1914 లో విజ్ఞాన చంద్రికా గ్రంథమాల హైదరాబాదుకు మారడంతో ఆదిరాజు వారు తిరిగి హైదరాబాదుకు చేరుకున్నారు.
ఆదిరాజు వారికి బాగా పేరు తెచ్చిన గ్రంథాల్లో ప్రాచీనాంధ్ర నగరములు , మన తెలంగాణా అనేవి ప్రధానమైనవి.అలంపురం, ఆనెగొంది, కళ్యాణి, కొండాపురం,కొలనుపాక,గోలకొండ,పానుగల్లు, ప్రతిష్ఠానం, బోనగిరి, రాచకొండ, వరంగల్లు, వేల్పుగొండ అనే ప్రసిద్ధ నగరాలకు సంబంధించిన పూర్వరాజుల, రాణుల, మంత్రుల, శిల్పుల, గాయకుల, కవుల జీవిత చారిత్రక విశేషాలతో పాటు భౌగోళిక, సాంఘిక ఆర్థిక మత విషయాలను, ఆ పట్టణాల పతన హేతువులను నిష్పక్షపాతంగా వివేచించి ఎన్నో అపూర్వవిషయాలను వెలుగులోనికి తెచ్చారు.
ఆదిరాజువారు ఆనాడు పేర్కొన్న కొన్ని తాళపత్రగ్రంథాలు – శ్రీకృష్ణ శతానందీయం, తాలాంక నందినీ పరిణయం, దశరథరాజ నందినీ పరిణయం లాంటి కావ్యాలు పండిత పరిష్కృతాలయి వెలుగులోకి వచ్చాయి.
నాణెములను గురించి, చరిత్ర పునర్నిర్మాణంలో వాటి పాత్ర గురించి వివరిస్తూ భారతదేశంలో అతి ప్రాచీన నాణేలు తొలిసారిగా తెలంగాణ ప్రాంతమైన కరీంనగర్ లో దొరికాయని,నాణేలు ముద్రించే టంకసాలలు సైతం తెలంగాణలో ఉండేవని ఒకటి కొండాపూర్లో, రెండవది కోయిలకొండలో ఉండేదని చారిత్రకాధారాలతో నిరూపించారు.
తెలంగాణకు సంబంధించిన విభిన్న అంశాలను సత్య దృష్టితో పరిశీలిస్తూ వెలువరించిన గ్రంథం “మన తెలంగాణం”. ఆదిరాజు వారికి బాగా పేరు తెచ్చిన మరో గ్రంథం “షితాబుఖాన్ లేక సీతాపతిరాజు” చరిత్ర. 68 గ్రీకు పురాణ దేవతలకు సంబంధించిన కథలను, హిందూ దేవతలతో పోల్చి బాలురకీ అర్థమయ్యే రీతిలో సులభ వ్యావహారిక శైలిలో “గ్రీకు పురాణ కథలు” పేరుతో ప్రచురించారు.
ఇంకా విద్యార్థుల కోసం రఘునాథ నాయకుడు, మార్కోపోలో, మీరాబాయి, శ్రీహర్షుల సంక్షిప్త జీవిత చరిత్రలు ప్రచురించారు. జానపద సాహిత్యం, గ్రామనామాలు, వ్యక్తి చరిత్రలు, శాసనాలు, చరిత్రలు, దర్శనీయ స్థలాలు, సంస్కృతి సంబంధాలు, ఆచార వ్యవహారాలు, సామెతల జాతీయాల వివరణ, మహబూబునగర్, మెదక్, నల్లగొండ లాంటి వివిధ జిల్లాల స్వరూప స్వభావాల గురించిన వ్యాసాలు,వంటి ఎన్నో పరిశోధనాత్మక విశ్లేషణలు చేసారు.
దక్కన్ రేడియోలో మొదటి సారి తెలుగులో ప్రసంగించిన వ్యక్తి ఆదిరాజు వారే. దాదాపు నూట యాభై రేడియో ప్రసంగాలు చేశాడు. హైదరాబాదులో ఆ కాలంలో వెలసిన ప్రతీ సాహిత్య సాంస్కృతిక సంస్థకు వెన్నుదన్నుగా నిలిచిన ఆదిరాజువారు 1914 నుండి 1921 దాకా చాదర్ఘాట్ హైస్కూలులో ఆతర్వాత 1949 నుండి 1953 దాక నారాయణ గూడా బాలికోన్నత పాఠశాలలో పనిచేశారు. ఆ తర్వాత సంగ్రహాంధ్ర విజ్ఞానకోశానికి ప్రధాన సంగ్రాహకులుగా వ్యవహరించారు. 1973 సెప్టెంబర్28న అస్తమించిన ఆదిరాజు వీరభద్రరావు తెలంగాణా వికాసానికి చేసిన సేవ చిరస్మరణీయము.
(సేకరణ:- తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన “ తెలంగాణ తేజోమూర్తులు ” గ్రంధం.)