ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీబీ అంత్యక్రియలు
చెన్నై: సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు జరిగాయి. బాలు భార్య సావిత్రమ్మ, తనయుడు ఎస్పీ చరణ్, కుమార్తె పల్లవి, సోదరి శైలజ సహా కుటుంబీకులు చివరి సారిగా చేయాల్సిన క్రతువులు నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలో నిన్న రాత్రే బాలు పార్థీవదేహాన్ని చెన్నై శివారులోని తామరైపాక్కంలో ఉన్న ఎస్పీబీ వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. ఇవాళ ఉదయం అక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బాలు అంతిమ సంస్కారాలకు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరై నివాళులర్పించారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలును కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు తామరైపాక్కం వ్యవసాయక్షేత్రానికి భారీగా తరలిచ్చారు. కొవిడ్ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే అంత్యక్రియలకు అనుమతించారు. సినీ ప్రముఖులు భారతీరాజా, దేవిశ్రీ ప్రసాద్, మనో తదితరులు బాలు భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళులర్పించారు..