గ్రేటర్ హేదరాబాద్ లో 25% బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ఆమోదం
౼ కోవిడ్ నిబంధనలతో అన్ని రూట్లలో నడిపేందుకు చర్యలు
– రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు వెల్లడి
కరోనా లాక్ డౌన్ సమయం నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో ఆగిపోయిన సిటీ సర్వీసులను రేపటి 25 నుండి పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్పష్టం చేశారు.
దాదాపు ఆరు నెలలకు పైగా నిలిచిపోయిన సిటీ సర్వీసులను అన్ని రూట్లలో రేపటి నుండి 25 శాతం నడుపేందుకై ప్రభుత్వం ఆమోదించినట్లు ఆయన తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 29 డిపోలలో ఉన్న దాదాపు 2800 బస్సుల్లో 25 శాతం బస్సులు రాకపోకలు సాగించనున్నాయని చెప్పారు.
కరోనను దృష్టిలో ఉంచుకుని వైరస్ ప్రబలకుండా ఉండేందుకై మార్చి 22 నుంచి ఇప్పటి వరకు సిటీలో బస్సులను నడపలేదని, అయితే సామాన్య ప్రజల రవాణా ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
గతంలో హైదరాబాద్ రీజియన్ లో సుమారు 1700 బస్సులు, సికింద్రాబాద్ రీజియన్ లో 1200 బస్సులు ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేవి అన్నారు.